హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆస్పత్రి పేద ప్రజల పాలిట అత్యంత ఆధునిక వైద్య కేంద్రంగా మారుతోంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడే రోగుల కోసం కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ ఖర్చుతో కూడుకున్న అత్యాధునిక ‘నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (NGS) జన్యుపరీక్షను ఇక నుంచి నిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా అందించనున్నారు. కొన్ని ఏళ్లుగా ప్రయోగాత్మకంగా సాగిన ఈ పరీక్షలు విజయవంతం కావడంతో శుక్రవారం నుంచి వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి అత్యాధునిక జన్యు నిర్ధారణ పరీక్షను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ ఒక్క పరీక్షకే రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చవుతుండగా.. నిమ్స్ యాజమాన్యం దీనిని పేదలకు ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద ఉచితంగా చేయనుంది. ఈ పరీక్ష ముఖ్యంగా చివరి దశ (స్టేజ్-4) క్యాన్సర్ రోగులకు, కీమోథెరపీ చేసినా ఎలాంటి ఫలితం దక్కని వారికి ఒక పెద్ద సంజీవనిలా ఉపయోగపడనుంది. గతంలో క్యాన్సర్ బాధితులందరికీ ఒకే రకమైన మందులు వాడటం వల్ల కొందరిలో వ్యాధి మరింత ఎక్కువయ్యేది. అయితే ఈ ఎన్జీఎస్ పరీక్ష ద్వారా రోగి శరీరంలో ఏ జన్యువు లోపం వల్ల క్యాన్సర్ మ్యుటేషన్‌కు గురైందో కచ్చితంగా గుర్తించి, నేరుగా ఆ జన్యువుపైనే దాడి చేసే ‘టార్గెటెడ్ థెరపీ’, పర్సనలైజ్డ్ మందులను సిఫార్సు చేయడానికి డాక్టర్లకు వీలు కలుగుతుంది.
ఈ అత్యాధునిక సేవలు ముఖ్యంగా ఊపిరితిత్తులు, పెద్దపేగు, అండాశయ, రొమ్ము క్యాన్సర్లతో బాధపడుతూ జీవితంపై ఆశలు వదులుకున్న స్టేజ్-4 రోగులలో ‘ఇమ్యునోథెరపీ’ చికిత్స మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్లలో ప్రభుత్వ బడ్జెట్ మరియు సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేసి నిమ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే క్యాన్సర్ వైద్యంతో పాటు అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ‘పల్మనరీ అల్వియోలార్ ప్రొటినోసిన్’ నివారణకు వాడే లంగ్ వాషింగ్ చికిత్సను కూడా నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు.








