పవన్ ఒక ప్యాకేజ్ స్టార్, జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళతారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్‌ను ఒక ‘ప్యాకేజ్ స్టార్’ అని అభివర్ణిస్తూ.. భవిష్యత్తులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గనుక ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఆయన వైపు వెళ్లడానికి కూడా పవన్ వెనుకాడరని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పెద్ద కలకలం రేపుతున్నాయి.

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను విమర్శించే కనీస స్థాయి గానీ, అర్హత గానీ పవన్ కల్యాణ్‌కు లేవని అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. “ధైర్యముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయండి, ఆయన ఇంటి ముందు నేను అడ్డుగా నిలబడతా” అంటూ పవన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డల జోలికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా రాజకీయ నాయకులు రావాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే తెలంగాణలో మళ్లీ ‘గో బ్యాక్ ఆంధ్ర’ ఉద్యమం మొదలుపెడతామని ఆయన గట్టిగా హెచ్చరించారు.

ఇదే సమయంలో ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతల తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఏపీ నేతలంతా ఉండేది హైదరాబాద్‌లోనేనని, ఆస్తులన్నీ ఇక్కడే సంపాదించుకుంటూ.. మళ్లీ అన్ని వేల కోట్లు పెట్టి అమరావతిని ఎందుకు కట్టుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ ప్రజలను గానీ, ఇక్కడి మేధావులను గానీ తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు