రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై విపక్షాలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం వరి కొనుగోలు కోసం చేస్తున్నంత ఖర్చు భారతదేశ చరిత్రలో ఏనాడూ ఏ ప్రభుత్వమూ చేయలేదని, ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని గుర్తుచేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వరి కొనుగోళ్లు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు.
రైతులను ఆదుకుంటామంటూ బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో నాటకీయ నిరసనలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ యాసంగి సీజన్ పంటలో రాష్ట్రవ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండగా, అందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇందులో కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని ముందే చెప్పిందని వెల్లడించారు. కేంద్రం చేతులెత్తేసినా, మిగిలిన అదనపు ధాన్యాన్ని రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే అప్పు చేసి మరి కనీస మద్దతు ధరకు (MSP) కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ యాసంగి పంటలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే రూ.13,050 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ధాన్యం రవాణాలో ఇబ్బందులు లేకుండా ఇసుక లారీలను, భారీ వాహనాలను కూడా వాడుకుంటున్నామని.. ప్రస్తుతం కొంత వేధిస్తున్న హమాలీల కొరతను కూడా అధిగమించి కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.








