ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తనకున్న ప్రగాఢమైన అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆయన సాషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ సమయం వచ్చినప్పుడు పవన్ గొప్ప మనసు, ఆయన అసలైన వ్యక్తిత్వం గురించి తనకు తెలిసిన నిజాలను ప్రపంచం ముందు గర్వంగా చాటి చెబుతానని బండ్ల గణేష్ భావోద్వేగంగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పట్ల బండ్ల గణేష్ కు ఉన్న భక్తి లాంటి అభిమానం గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలోనూ పలు సినిమా వేదికలపై ఆయన పవన్‌ను దేవుడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ తన హృదయంలోని మాటను పంచుకుంటూ.. “పవన్ కల్యాణ్ సార్ గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన క్యారెక్టర్‌ను, నైజాన్ని ప్రపంచానికి వివరించే ఆ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను. పదవులు, హోదాలు మాత్రమే ముఖ్యం కాదు.. ఒక మనిషి విలువ అతని ప్రవర్తన, మాట, మరియు స్వచ్ఛమైన మనసులో ఉంటుందని నిరూపించిన మహోన్నత వ్యక్తి ఆయన” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తన గౌరవాన్ని వ్యక్తపరిచే వేదిక కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నట్లు ఆయన తన వ్యాఖ్యల్లో స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ‘జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్’ను సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని బండ్ల గణేష్ ఈ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టి, ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పటికీ.. ఆయనపై బండ్ల గణేష్ చూపిస్తున్న ఈ అచంచలమైన అభిమానం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్‌గా మారింది. పవన్ ఫ్యాన్స్ సైతం ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.









