తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన భేటీ చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ సుందర్.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన చిన్న కుమార్తె అవంతిక వివాహ వేడుకకు సంబంధించిన లగ్న పత్రికను విజయ్‌కు ఖుష్బూ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా తన భర్త సుందర్ సి, కుమార్తెలతో కలిసి ముఖ్యమంత్రితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆమె ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
“ఈ రోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. మా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆయన నివాసంలో కలిసి మా చిన్న కుమార్తె అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహానికి సాదరంగా ఆహ్వానించాం. విజయ్‌ను కలవడం ఎప్పుడూ అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నా కుమార్తెలు ఆయనను కలవడంతో ఎంతో థ్రిల్ అయ్యారు. తన బిజీ షెడ్యూల్‌లోనూ మాకు సమయం కేటాయించి, ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో మమ్మల్ని స్వాగతించారు. ఎప్పటిలాగే తనదైన చిరునవ్వుతో పలకరించారు. ఆయన మా కుటుంబానికి అందించిన దీవెనలు, ప్రేమ ఎంతో అమూల్యమైనవి” అని ఖుష్బూ పేర్కొన్నారు.
మరోవైపు, ఖుష్బూ చిన్న కుమార్తె అవంతిక త్వరలోనే ‘ఆరంభం’ అనే చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా నటిగా అరంగేట్రం చేయబోతున్నారు. ఇక వీరి పెద్ద కుమార్తె ఆనందిత సినీ నిర్మాతగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న ఖుష్బూ.. తన కుటుంబంతో కలిసి తమిళనాడు సీఎంను కలవడం, సదరు ఫొటోలను షేర్ చేయడంతో ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు అవంతికకు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.









