నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?: ప్రకాశ్‌ రాజ్‌పై బండ్ల గణేశ్‌ ఘాటు వ్యాఖ్యలు!

జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ మొత్తం తిరుగుతానని, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని పవన్ ఇటీవల వ్యాఖ్యానించగా, దీనిపై ప్రకాశ్ రాజ్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ‘‘మీరొస్తానంటే మేమొద్దంటామా?’’ అని పోస్ట్ చేస్తూ, పవన్ సింగిల్‌గా వస్తారా లేక పొత్తుతో వస్తారా అనేది ముందు చెప్పాలంటూ పరోక్షంగా ప్రశ్నించారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్‌కు బండ్ల గణేష్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి?’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా బండ్ల గణేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి ఊర్లో, ప్రతి రాజకీయ అంశంలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా అంటూ నిలదీశారు.

పని లేకపోతే చూసుకోవాలి కానీ, అన్ని విషయాల్లో దూరి అనవసరంగా హీరోలా ఫీలవ్వద్దని ప్రకాశ్ రాజ్‌కు బండ్ల హితవు పలికారు. ప్రతి చిన్న విషయానికీ స్పందించడం మానుకోవాలని చెప్తూ.. “ముందు నీ అడ్రస్ ఏంటో నువ్వు తెలుసుకో, ఆ తర్వాతే ఈ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్!” అంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు