మీ సినిమాలో నటించడానికి నేను రెడీ: రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకనే యమగూచిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్ పోరులో సింధు 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఈ ఘనతతో జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయ షట్లర్‌గా సింధు సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఈ చారిత్రక విజయంపై స్పందించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పీవీ సింధును ప్రశంసలతో ముంచెత్తారు. “ఇది నిజమైన ఛాంపియన్ కంబ్యాక్. నీ అద్భుత విజయానికి శుభాకాంక్షలు సింధు. దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది” అంటూ ఆయన పోస్ట్ చేశారు. రాజమౌళి అభినందనలకు అంతే ఆసక్తికరంగా స్పందించిన సింధు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఒక చమత్కారమైన ఆఫర్‌ను కూడా ఇచ్చారు.

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపిన సింధు.. “భవిష్యత్తులో మీ కథల్లో ఎప్పుడైనా ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పాత్ర అవసరమైతే, ఓ ‘కొత్త నటి’గా మారడానికి నేను సంతోషంగా సిద్ధంగా ఉన్నాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం క్రీడా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు