సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా జగ్గారెడ్డి లాంటి నిస్వార్థ నాయకుడు దొరకరని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం పట్ల జగ్గారెడ్డికి ఉన్న విధేయతను వివరిస్తూ.. రాహుల్ గాంధీని శ్రీరాముడితో, జగ్గారెడ్డిని హనుమంతుడితో ముఖ్యమంత్రి పోల్చారు. నాయకుడిగా మార్కులు వేయాల్సి వస్తే తనకంటే జగ్గారెడ్డికే ఎక్కువ మార్కులు వస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతటి గొప్ప నాయకుడిని ఎన్నికల్లో ఓడించడం సంగారెడ్డి ప్రాంత ప్రజల దురదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జగ్గారెడ్డి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారని సీఎం కొనియాడారు. సొంత కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజల కోసమే శ్రమించే ఇలాంటి నాయకుడు కచ్చితంగా ప్రత్యక్ష ప్రజా జీవితంలోనే కొనసాగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.









