మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాలకు చెందిన 513 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించినట్లు వెల్లడించారు. వీరిలో 5 మంది సీఐలు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు, 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్యధికంగా 224 మంది సిబ్బందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. మారుతున్న పరిస్థితుల్లో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్, రోడ్డు భద్రత వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ భావిస్తోంది. కొత్త బాధ్యతలు చేపట్టే ముందు సిబ్బందిని రెండు నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్‌మెంట్‌పై పనిచేయించనున్నట్లు డీజీపీ తెలిపారు.
సిబ్బంది విద్యార్హతలు, గత అనుభవం, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని తుది బాధ్యతలను నిర్ణయిస్తామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన సిబ్బంది అనుభవాన్ని కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే పునర్వ్యవస్థీకరణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.









