శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ ప్రారంభమైంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిపోయిన వరద తిరిగి రావడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 24,912 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 40,978 క్యూసెక్కులు కలిపి మొత్తం 65,890 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
అధికారుల వివరాల ప్రకారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి 30,512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 165.92 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ కేంద్రాల ద్వారా 55,768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జెన్కో అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం మరింత పెరిగితే రిజర్వాయర్ నీటిమట్టం, నిల్వలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.









