సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశమైన సీఎం.. గాలింపు చర్యల పురోగతిపై ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఉండాలని స్పష్టం చేశారు.
మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు డోర్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లను గాలింపు చర్యల్లో వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పారాదీప్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని, వాటి వివరాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
మరోవైపు కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన బోటు ఆచూకీకి సంబంధించిన సమాచారం లభిస్తే వెంటనే తెలియజేయాలని వారికి సూచించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గాలింపు చర్యలను వేగవంతం చేసి, ప్రతి పురోగతిని వారికి తెలియజేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.









