తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్రవ్యాప్త ఆటో, క్యాబ్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.
ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారుల మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, డిమాండ్లపై అధికారులు చర్చించారు. పలు అంశాలపై సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమించుకోవాలని జేఏసీ నిర్ణయించింది.
సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సేవలకు అంతరాయం తప్పినట్లైంది. చర్చల్లో తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. అయితే భవిష్యత్తులో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.









