ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిలో స్వీకరించే ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, కొత్తగా అందే దరఖాస్తులను వెంటనే పోర్టల్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.









