హైదరాబాద్ నగర ప్రక్షాళనతో పాటు ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్ఎమ్డీఏ, జీహెచ్ఎమ్సీ, ఎంఆర్డీసీఎల్ కమిషనర్లు, ఎండీలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
సమావేశంలో మూసీ ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుత పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. నగర ప్రక్షాళనకు, మూసీ పునరుజ్జీవనానికి ప్రాజెక్ట్ కీలకమైనందున పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులకు సూచించారు.
ప్రాజెక్ట్ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.









