విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.
మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. అలాగే తరగతి గదులు, వసతి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. భోజనంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, అవసరమైన సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.









