అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఈ నెల 3న వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. సముద్రంలో వేట సాగిస్తుండగా వారి బోటు గేర్ బాక్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజిన్ పనిచేయకుండా నిలిచిపోయింది. దీంతో బోటు సముద్రంలో గాలివాటానికి కొట్టుకుపోతూ దూర ప్రాంతాలకు చేరుకుంది.
దాదాపు 23 రోజులపాటు సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు చివరకు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా తీరానికి నిన్న రాత్రి సురక్షితంగా చేరుకున్నారు. అక్కడి అధికారులు, వైద్య బృందాలు వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురూ ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
దిఘా నుంచి ఈ ఉదయం 10 గంటలకు మత్స్యకారులు తమ స్వస్థలాలకు బయలుదేరారు. త్వరలోనే ఓడలరేవుకు చేరుకోనున్నారు. 23 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడటంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. సురక్షితంగా స్వస్థలానికి తిరిగి వస్తుండటంతో కోనసీమలోనూ సంతోషం వ్యక్తమవుతోంది.









