ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ జయరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఏసీబీ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక రికార్డులు, దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జయరాజ్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు, అధికారిక రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? వాటికి సంబంధించిన లెక్కలు, పత్రాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
కాగా, ఏసీబీ సోదాలతో కలెక్టరేట్లో కొంతసేపు సందడి నెలకొంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. తనిఖీలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.









