భారత నౌకలపై ఇరాన్ దళాల కాల్పులు..
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య హార్మూజ్ జలసంధిలో భారతీయ వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఏప్రిల్ 18న ‘జగ్ అర్నవ్’, ‘సన్మార్ హెరాల్డ్’ అనే రెండు భారతీయ నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరిపారు. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన భారత నౌకాదళం (Indian Navy), సముద్ర మార్గాల్లో మన నౌకల రక్షణ కోసం భద్రతను పతాక స్థాయికి పెంచింది. ప్రస్తుతం ‘దేశ్ గరిమ’ అనే ఆయిల్ ట్యాంకర్ యుద్ధ నౌకల రక్షణలో సురక్షితంగా భారత్ వైపు ప్రయాణిస్తోంది.
నేవీ అడ్వైజరీ – కొత్త నిబంధనలు..
ప్రస్తుత అస్థిర పరిస్థితుల నేపథ్యంలో భారత నౌకాదళం తన వాణిజ్య నౌకలకు కఠినమైన అడ్వైజరీని జారీ చేసింది. నేవీ నుంచి స్పష్టమైన ఆదేశాలు మరియు అనుమతి లభించే వరకు ఏ భారతీయ నౌక కూడా హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న ‘లారక్ ఐలాండ్’కు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. ఒమన్ తీరం వెంబడి ఉన్న పాత మార్గాల్లో మందుపాతరల ముప్పు ఉన్నందున, ప్రతి అడుగు ఆచి తూచి వేయాలని నావికులను హెచ్చరించింది.
భద్రతా వలయంలో మరో 14 నౌకలు..
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం మరో 14 భారతీయ నౌకలు స్వదేశానికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. వీటి భద్రతను పర్యవేక్షించేందుకు భారత నౌకాదళం ఇప్పటికే ఏడు యుద్ధ నౌకలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించింది. జలసంధిని దాటే ప్రతి నౌకను నేవీ తన పూర్తి పర్యవేక్షణలోకి తీసుకుని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఒకవైపు సైనికపరంగా అప్రమత్తంగా ఉంటూనే, మరోవైపు భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతూ వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నం చేస్తోంది.









