అన్న క్యాంటీన్‌లో నిరాడంబరంగా పుట్టినరోజు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును సామాన్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి సందర్శించిన ఆయన, అక్కడ అల్పాహారం కోసం వచ్చిన వారికి స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కలిసి కూర్చుని అల్పాహారం స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నదే తన ఆశయమని, అందుకే ఈ రోజును పేదల మధ్య గడపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
గత ప్రభుత్వంపై విమర్శలు – అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..
ఈ సందర్భంగా చంద్రబాబు గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను గత పాలకులు కక్షగట్టి మూసివేశారని, అన్నం పెట్టే వారిపై కూడా కేసులు పెట్టిన దుర్మార్గపు చరిత్ర వారిదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయని, త్వరలోనే మరిన్ని అందుబాటులోకి వస్తాయని వివరించారు. కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం అందించడం ద్వారా కూలీలు, ఆటో డ్రైవర్లు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
భువనేశ్వరి భారీ విరాళం – ప్రజా ఉద్యమంగా అన్నదానం..
ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని నారా భువనేశ్వరి ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణ ఖర్చు నిమిత్తం తన సొంత నిధుల నుంచి రూ.76 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్నదానాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని, ప్రతి ఒక్కరూ తమ శక్తిమేర విరాళాలు అందించి ఈ పథకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజు కానుకగా ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన భువనేశ్వరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.









