తమిళనాడు ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ధీమా

 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వస్తాయని, రాజకీయ పార్టీల అంచనాలన్నీ తారుమారవుతాయని తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ, తమ పార్టీ గుర్తు ‘విజిల్’ సత్తా ఏమిటో ఫలితాల రోజే తెలుస్తుందని అన్నారు. పాతతరం రాజకీయ లెక్కలు ఇప్పుడు పని చేయవని, యువత మార్పు కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత డీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని, ముఖ్యమంత్రి స్టాలిన్ పాలనకు ఇదే చివరి ప్రచారమని విజయ్ జోస్యం చెప్పారు. తనను కేవలం ఒక నటుడిగానే చూస్తున్న ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్ ఇస్తూ.. తాను సినిమాల్లో మాత్రమే నటుడినని, కానీ రాజకీయనాయకులుగా ప్రజల ముందు డ్రామాలు ఆడుతున్న వారే అసలైన నటులని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పుకునే బీజేపీ నాయకులు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తమను దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమయ్యాయని, అయితే ప్రజల మద్దతు తనకే ఉందని విజయ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని, సంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలు ఈసారి చిత్తు కాక తప్పవని ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే యోధుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, తమిళనాడు భవిష్యత్తును మార్చే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు