దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కన్నడ నటి రన్యా రావుకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత ఏడాది కాలంగా బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్న ఆమెకు కర్ణాటక ఆర్థిక నేరాల విచారణ న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గతేడాది మార్చిలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడినప్పటి నుండి ఆమె జైలులోనే విచారణ ఎదుర్కొంటున్నారు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యా రావు వద్ద 14.8 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సవతి కుమార్తె కావడంతో తనిఖీలు ఉండవనే ధైర్యంతో ఆమె ఈ స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆమె నాలుగు సార్లు దుబాయ్ వెళ్లి రావడం అధికారులకు అనుమానం కలిగించి, పక్కా సమాచారంతో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రన్యా రావుపై ‘విదేశీ మారక ద్రవ్య రక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ’ (COFEPOSA) చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఆమెకు గతంలో బెయిల్ లభించలేదు. ఈ చట్టం ప్రకారం అరెస్టైన వారు కనీసం ఏడాది పాటు జైలులో ఉండాల్సి రావడంతో ఆమె ఇన్నాళ్లు శిక్ష అనుభవించారు. ఈ కేసులో ఆమెతో పాటు తెలుగు వ్యక్తి తరుణ్ కొండూరు, వ్యాపారి సాహిల్ సకారియా కూడా నిందితులుగా ఉన్నారు. బెయిల్ మంజూరు కావడంతో రన్యా రావు త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.









