అనంతపురంలో ‘హనీ ట్రాప్’ కలకలం: ఖాకీల అండతో అక్రమ వసూళ్లు.. ఆడియో టేపులు బట్టబయలు!

అనంతపురం నగరంలో అమాయకులను, ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక భారీ హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది. మహిళలను ఎరగా వేసి బాధితులతో పరిచయాలు పెంచుకోవడం, ఆపై వారిని ఏకాంతంగా ఉన్న సమయంలో పట్టుకుని బెదిరింపులకు పాల్పడటం ఈ ముఠా ప్రధాన వ్యూహం. తాము చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం కేసులు పెడతామని, సమాజంలో పరువు తీస్తామని భయపెడుతూ ఈ ముఠా లక్షల రూపాయలు వసూలు చేస్తోంది.

ఈ అక్రమ దందా వెనుక కొందరు పోలీసు అధికారుల ప్రమేయం ఉండటం గమనార్హం. బాధితులు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే, రంగంలోకి దిగుతున్న ఒక హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ స్టేషన్ పేరుతో భయపెట్టి భారీ మొత్తంలో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు, ఒక ప్రముఖ జ్యోతిష్యుడి నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ముఠా సభ్యులు మరియు పోలీసులు బాధితులను బెదిరిస్తున్న ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఎస్పీ జగదీష్ దృష్టికి చేరింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ముఖ్యంగా శాఖాపరమైన క్రమశిక్షణ ఉల్లంఘించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు