ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి భారీ షాక్ తగిలింది. పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రాఘవ్ చద్దాతో పాటు మరో ఆరుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ వీరు రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ కూడా సమర్పించారు. ఈ అనూహ్య పరిణామంపై ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదంతా బీజేపీ వెనుకుండి ఆడిస్తున్న నాటకమని, పంజాబ్ ప్రజలకు ఆ పార్టీ మరోసారి ద్రోహం చేసిందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.
ఈ ఫిరాయింపుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. రాఘవ్ చద్దాను ఒక పావుగా వాడుకుని తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించింది. ఏడుగురు రాజ్యసభ సభ్యులను తీసుకువస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చద్దాకు అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చారని ఆప్ ఆరోపించింది. అయితే, ఆప్ చేస్తున్న ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం తమపై బురదజల్లేందుకు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది.
గత కొంతకాలంగా రాఘవ్ చద్దా, ఆప్ అధిష్ఠానం మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ నెల మొదట్లో రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి చద్దాను అధిష్టానం అనూహ్యంగా తొలగించింది. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా, ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు కూడా చద్దా కనీసం స్పందించలేదు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన రాఘవ్ చద్దా.. ఇప్పుడు ఏకంగా ఎంపీలతో కలిసి పార్టీని వీడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.









