తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే బెయిల్‌పై ఉన్న ఆయన, తనపై ఉన్న అభియోగాల నుంచి తప్పించుకునేందుకు సాక్షులను ప్రలోభపెట్టి, బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలతో కొత్తగా క్రిమినల్ కేసు నమోదైంది. గత మూడు రోజులుగా పరారీలో ఉన్న ఆయనను, రాజమండ్రి కోర్టు సమీపంలో మఫ్టీలో ఉన్న ప్రత్యేక పోలీసు బృందాలు మాటేసి నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నాయి.
ఈ వ్యవహారంలో పోలీసుల అంతర్గత కుమ్మక్కులు సైతం కలకలం రేపాయి. మూడు రోజుల క్రితమే అనంతబాబును అరెస్ట్ చేయాల్సి ఉండగా, అప్పటి విచారణాధికారి ఆయనకు ముందస్తు సమాచారం ఇచ్చి పరారీకి పరోక్షంగా సహకరించినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఆ అధికారిని తక్షణమే వీఆర్‌కు పంపారు. అనంతరం దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన కొత్త అధికారి, పక్కా వ్యూహంతో నిఘా వర్గాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అనంతబాబు కదలికలను ట్రాక్ చేసి, ఆయన కోర్టుకు వస్తున్నారన్న పక్కా సమాచారంతో చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ కేసు నుంచి బయటపడేందుకు అనంతబాబు నలుగురు కీలక సాక్షులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున ఆశచూపడంతో పాటు, వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయి. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీని ఈ కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందన్న కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు, ఈ కేసును కొట్టివేయాలని అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన బెయిల్ రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.









