కష్టపడితే సాధారణ కార్యకర్త కూడా పొలిట్ బ్యూరో సభ్యుడు కావచ్చు: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తలకు ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. క్రమశిక్షణ, కష్టం ఉంటే పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో కూడా చోటు దక్కించుకోవచ్చని భరోసా ఇచ్చారు. కార్యకర్తల పనితీరును శాస్త్రీయంగా అంచనా వేసేందుకే ‘మై టీడీపీ’ యాప్‌ను తీసుకువచ్చామని, ఎవరి కష్టం వృథా కాదని స్పష్టం చేశారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనపై బాధ్యతలు పెరిగాయని, అయితే తనలో ఏమాత్రం అహంకారం లేదని లోకేశ్ పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి సంక్షేమం కోసం పార్టీ ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘యువగళం’ పాదయాత్ర ద్వారా తాను నేరుగా ప్రజల కష్టాలను చూశానని, భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని చెప్పారు. కార్యకర్తల కష్టమే తమను ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన కొనియాడారు.

వైసీపీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్, 2024 ఎన్నికల ఫలితాలు అహంకారానికి తగిన గుణపాఠం అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించిందని, తాము అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వైసీపీ చేసే అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడులో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైసీపీ రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైన్యానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు