గుంటూరు నగరంలో స్పా మరియు మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచార దందాను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు, రెడ్డిపాలెం సమీపంలో ఉన్న ‘ఐరా స్పా’ సెంటర్‌పై పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా మేనేజర్‌తో పాటు ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. కొంతకాలంగా మసాజ్ పేరుతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడిన ముగ్గురు మహిళల్లో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులుగా పోలీసులు గుర్తించారు. స్పా మేనేజర్‌గా వ్యవహరిస్తున్న సూర్య అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న నలుగురిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నల్లపాడు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ దంద వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు. నగరంలోని స్పా సెంటర్ల పేరుతో ఇటువంటి అసాంఘిక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.









