యాక్సిస్ మై ఇండియా సర్వే సంచలనం: అప్రమత్తమైన విజయ్ – టీవీకే అభ్యర్థులకు కీలక ఆదేశాలు

తమిళనాడు శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. మెజార్టీ సర్వేలు డీఎంకే కూటమికి అధికారం దక్కుతుందని అంచనా వేయగా, ప్రముఖ సంస్థ ‘యాక్సిస్ మై ఇండియా’ మాత్రం భిన్నమైన ఫలితాలను వెల్లడించింది. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సునామీ సృష్టించబోతోందని, ఆ పార్టీ 98 నుంచి 120 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పింది. దీంతో ఫలితాలకు ముందే తమిళనాట క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి.

యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం.. టీవీకేకు 98-120, డీఎంకేకు 92-110, అన్నాడీఎంకేకు 22-32 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అంచనాలతో అప్రమత్తమైన విజయ్, పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులెవరూ ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా నేరుగా పార్టీ హెడ్ ఆఫీసుకే రావాలని ఆయన గట్టిగా ఆదేశించారు. గతంలో ఎడప్పాడి నియోజకవర్గంలో తమ అభ్యర్థి అమ్ముడుపోయిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని విజయ్ ఈసారి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరోవైపు, హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో డీఎంకే, అన్నాడీఎంకేలు కూడా వ్యూహరచన చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకుంటే స్వతంత్రులు, చిన్న పార్టీలను తమవైపు తిప్పుకోవాలని డీఎంకే భావిస్తుండగా, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయ్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను ఆఫర్ చేసి, ఆయన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే యోచిస్తోంది. అయితే, తానే ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదలతో ఉన్న విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. మే 4న వెలువడనున్న ఫలితాలే దీనికి సమాధానం చెప్పనున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు