తిరుపతిలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించే జంతుబలులను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి, జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఈ జాతర పేరుతో జరిగేది దారుణమైన మారణకాండ అని ఆమె అభివర్ణించారు. వేలాది మూగజీవాలను ఎటువంటి కారణం లేకుండా చంపడం దేశం మొత్తం గమనిస్తోందని, ఒక సామూహిక హత్యగా ఇది మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే జంతుబలులపై నిషేధం ఉందని, ఏపీలో కూడా అదే దిశగా చర్యలు తీసుకోవాలని మేనకా గాంధీ సూచించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు జంతుబలులను నిషేధించి, వాటికి బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా భక్తులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె ఉదహరించారు. టెక్నాలజీ మరియు అభివృద్ధిలో అత్యంత ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు, ఈ హింసను ఆపడం సాధ్యం కాదా అని ఆమె తన లేఖలో ప్రశ్నించారు.
జంతుబలులు సమాజంలో హింసను ప్రేరేపిస్తాయని, జాతర సమయంలో భక్తులు మద్యం సేవించి ఉండటం వల్ల ఇది మరిన్ని అవాంఛనీయ ఘటనలకు దారితీసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. గతంలో ఎంతోమంది మేధావులు, యువకులు, వైద్యులు కూడా ఈ బలులను ఆపాలని తనకు విజ్ఞప్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే, మూగజీవాల ప్రాణాలను కాపాడేలా తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.









