పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయనని ప్రకటించడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలన సాగించిన మమతా బెనర్జీ, ప్రజల తీర్పును గౌరవించకుండా ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.
దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఒక సీనియర్ నాయకురాలు ఇలా ప్రవర్తించడం నమ్మశక్యంగా లేదని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అనేది వ్యవస్థల కలయికతో నడుస్తుందని, అటువంటి వ్యవస్థలను మరియు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా పదవిని పట్టుకుని వేలాడటం అంటే నేరుగా ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ఆయన మండిపడ్డారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా మమత దిగిపోకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మమత ప్రవర్తనను తప్పుబడుతూ ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆయన గుర్తు చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమి పాలైనప్పటికీ, రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తేలా ఆమె తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.









