ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పర్యటించనున్నారు. అక్కడ జరగనున్న నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమానికి తరలివస్తుండటంతో చంద్రబాబు పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
షెడ్యూల్ ప్రకారం, సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రయాణించి, ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా ప్రమాణ స్వీకార వేదిక అయిన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ వేడుకలో ఆయన పాల్గొని, కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి తిరుగు ప్రయాణమై సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లడంతో ఆయన పర్యటన ముగుస్తుంది.









