తమిళనాడు రాజకీయ చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. 13 ఏళ్ల క్రితం ఒక బహిరంగ వేదికపై వెనుక వరుసకు పరిమితమైన నటుడు విజయ్, నేడు అదే తమిళనాడూ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏ విధంగానైతే అవమానాలను ఎదుర్కొని అధికార పీఠాన్ని అధిరోహించారో, విజయ్ విషయంలోనూ అదే పునరావృతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా శతాబ్ది ఉత్సవాల్లో ఆనాటి చేదు అనుభవం
2013లో చెన్నైలో జరిగిన ‘సినిమా శతాబ్ది ఉత్సవాలకు’ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి జయలలిత హాజరయ్యారు. ఆ సమయంలో విజయ్ నటించిన ‘తలైవా’ చిత్రం విడుదల వివాదాల్లో చిక్కుకుని ఉండటంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ వేదికపై ప్రముఖ నటులందరికీ ముందు వరుసలో సీట్లు కేటాయించగా, విజయ్‌ను మాత్రం వెనుక వరుసలో కూర్చోబెట్టారు. ఇది ఆయనను అవమానించడమేనని అభిమానులు అప్పట్లో మండిపడ్డారు.
విక్రమ్ చూపిన చొరవ – ఒంటరిగా విజయ్
విజయ్ వెనుక వరుసలో ఒంటరిగా కూర్చోవడాన్ని గమనించిన నటుడు చియాన్ విక్రమ్, తన ముందు సీటును వదిలేసి వెళ్లి విజయ్ పక్కన కూర్చున్నారు. విక్రమ్ అడుగుజాడల్లోనే ఐశ్వర్య రజనీకాంత్ కూడా వెనుక వరుసకు వెళ్లారు. విజయ్ ఈ విషయాన్ని అప్పట్లో ఎక్కడా బహిరంగంగా విమర్శించనప్పటికీ, ఆయన శ్రేయోభిలాషులు మాత్రం ప్రభుత్వం కావాలనే ఆయనను తక్కువ చేసి చూపిందని భావించారు.
జయలలిత శపథం.. విజయ్ విజయం!
1989లో అసెంబ్లీలో తనపై జరిగిన దాడికి నిరసనగా, “ముఖ్యమంత్రిగానే మళ్లీ ఈ సభలో అడుగుపెడతాను” అని జయలలిత శపథం చేసి, 1991లో విజయం సాధించారు. దాదాపు అలాంటి పరిస్థితులే ఇప్పుడు విజయ్ విషయంలోనూ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వెనుక సీటుకు పరిమితం చేసిన అదే వ్యవస్థలో, నేడు ప్రజల అఖండ మెజారిటీతో అత్యున్నత స్థానంలో విజయ్ నిలవడం విశేషం. తమిళనాడులో సినీ తారల పట్ల ఉండే ఆరాధనా భావం మరోసారి రాజకీయ మార్పుకు నాంది పలికిందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.









