అమరావతిలో గ్లోబల్ మెడికల్ హబ్: బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నిడమర్రులో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న “బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్” (మెడికల్ కాలేజీ మరియు స్కిల్ యూనివర్సిటీ) కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, నర్సుల డిమాండ్‌ను అమరావతి నుంచే భర్తీ చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు.

ఈ మెడికల్ ప్రాజెక్టులో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు, 250 మెడికల్ సీట్లు మరియు వెయ్యికి పైగా నాన్-మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. పారిశ్రామికవేత్తలు కేవలం శంకుస్థాపనలతో ఆగిపోకుండా, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. బొల్లినేని ప్రాజెక్టును 2027 నాటికి, గూగుల్ క్యాంపస్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. అనుమతులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, నిర్మాణాలు వేగంగా పూర్తి చేసే బాధ్యత పారిశ్రామికవేత్తలదని ఆయన భరోసా ఇచ్చారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తన దార్శనికతను వివరిస్తూ, ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. కర్నూలును ‘డ్రోన్ సిటీ’గా, రాయలసీమలో ఫైటర్ జెట్ పరిశ్రమను, విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్‌ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా హరిత ఇంధన విధానాన్ని రూపొందిస్తున్నామని, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగానికి తగ్గట్టుగా అమరావతిని నిర్మిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు