ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు: వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’.. కాన్వాయ్ లలో వాహనాల సంఖ్య సగానికి తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు వినూత్న పొదుపు చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వారానికి ఒకరోజును ‘నో వెహికల్ డే’గా పాటించాలని కేబినెట్ తీర్మానించింది. ఆ రోజున మంత్రులు, ఉన్నతాధికారులు తమ అధికారిక వాహనాలను పక్కన పెట్టి, ఆర్టీసీ బస్సులు లేదా సైకిళ్లపై ప్రయాణించి సామాన్యులకు ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు.

పాలనా వ్యయాన్ని తగ్గించే క్రమంలో మంత్రుల కాన్వాయ్‌లలోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్‌లను తగ్గించుకోగా, ఇప్పుడు అది మంత్రులందరికీ వర్తించనుంది. వీటితో పాటు సచివాలయానికి రానక్కర్లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యం కల్పించడం, సాధ్యమైనంత వరకు సమావేశాలను వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతను 24 నుండి 27 డిగ్రీల మధ్య ఉంచడం ద్వారా విద్యుత్ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పర్యావరణ పరిరక్షణ మరియు ఇంధన స్వయంసమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ భవనాల్లో సోలార్ ఎనర్జీ వాడకాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అట్టహాసంగా చేసే ఖర్చులను నియంత్రించి, ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించాలని కేబినెట్ భావిస్తోంది. “వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం” అనే నినాదంతో ముందుకు సాగాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ పొదుపు చర్యలు రాష్ట్ర ఖజానాపై భారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజల్లో పొదుపు పట్ల చైతన్యాన్ని తీసుకువస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు