జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే భారీ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కీలక నేతలు, సామాజిక కార్యకర్తలు జనసేనలో చేరుతుండటంతో పార్టీకి నేషనల్ ఇమేజ్ పెరుగుతోంది. ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఎదిగిన పవన్, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి గొంతుకగా మారాలని భావిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో విస్తరణ వేగంగా జరుగుతున్నా, సొంత గడ్డ ఏపీలో పార్టీ సంస్థాగత బలోపేతం మాత్రం నెమ్మదిగా సాగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఏపీలో ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి జిల్లా, మండల కమిటీల నియామకం జరగకపోవడం పార్టీ క్యాడర్‌ను కొంత అసహనానికి గురిచేస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలనాపరమైన బాధ్యతల్లో బిజీగా ఉండటం ఒక కారణమైతే, నిబద్ధత కలిగిన వారికే పదవులు ఇవ్వాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కమిటీలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, కూటమి పార్టీలైన టీడీపీ-బీజేపీ నేతలతో సమన్వయం చేసుకోవడంలోనూ జనసైనికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జాప్యం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొంత గందరగోళం నెలకొంది.
పార్టీలోకి కొత్తగా వచ్చి చేరుతున్న వారు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కొందరు కార్యకర్తలు నామినేటెడ్ పదవుల కోసం ఒత్తిడి తెస్తుండటం పవన్‌కు సవాల్‌గా మారింది. అధికారంలోకి వచ్చాక పదవుల కోసం ఆశపడే వారి కంటే, గత పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ కమిటీల ఏర్పాటును వాయిదా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే అది భవిష్యత్తులో ఏపీలో పార్టీ ఎదుగుదలకు ప్లస్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.









