ఘాట్ రోడ్డుపై స్తంభించిన రాకపోకలు: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని భాకరాపేట కనుమ రహదారిపై సోమవారం ఉదయం భారీ ఏనుగుల గుంపు ప్రత్యక్షమవడంతో తీవ్ర కలకలం రేగింది. దట్టమైన అడవి ప్రాంతం నుండి ఒక్కసారిగా ఏనుగులు రోడ్డుపైకి రావడంతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు సుమారు గంటపాటు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఎమ్మెల్యే తక్షణ చొరవ – అంబులెన్స్‌ల సురక్షిత తరలింపు: ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తక్షణమే స్పందించారు. నిలిచిపోయిన వాహనాల్లో రెండు అత్యవసర అంబులెన్సులు కూడా ఉన్నాయని తెలుసుకున్న ఆయన.. వెంటనే పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, ఆ అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో అటవీ శాఖ అధికారులతో మాట్లాడి ఏనుగులను అడవిలోకి తోలేయాల్సిందిగా ఆదేశించారు.
అడవిలోకి ఏనుగులు.. ప్రయాణికుల ఊపిరి: ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అటవీ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా శ్రమించి ఏనుగుల గుంపును రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా మళ్లించారు. అనంతరం నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసేందుకు, కొద్దిరోజుల పాటు ఈ మార్గంలో ప్రత్యేక గస్తీ (పెట్రోలింగ్) నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.









