పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ధర్నాలు ఓ పెద్ద డ్రామా అని టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజల జేబులు గుల్ల చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు సిగ్గులేకుండా రోడ్డెక్కడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అడ్డగోలుగా రోడ్ సెస్ వేసి, వ్యాట్ పెంచి ఇంధన ధరల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టి సామాన్యులపై మోయలేని భారం మోపారని ధ్వజమెత్తారు.
జగన్ పాలనలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112 ఉంటే, పక్కనే ఉన్న కర్ణాటకలో రూ. 101 మాత్రమే ఉండేదని.. అంటే లీటర్‌కు రూ. 11 చొప్పున ఏపీ ప్రజలను దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తానే స్వయంగా బెంగళూరు వెళ్లినప్పుడు కర్ణాటక బోర్డర్‌లోనే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకునేవాడినని, తద్వారా 50 లీటర్లకు రూ. 550 వరకు ఆదా అయ్యేదని గుర్తుచేశారు. ఆనాటి అక్రమ సంపాదన పాపాన్ని మోస్తూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఒక్క పైసా కూడా ధరలు పెంచకపోయినప్పటికీ, కేంద్రం పెంచిన ధరలను సాకుగా చూపి వైసీపీ నాయకులు దొంగ ధర్నాలకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఇంధన ధరలతో పాటు మద్యంపై ‘జగనన్న టాక్స్’ పేరుతో విపరీతంగా ధరలు పెంచి, నాసిరకం బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం కారణంగా గత ఐదేళ్లలో 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని ఆరోపించారు. రూ. 43,000 కోట్ల అవినీతి ఆరోపణలతో 13 సీబీఐ కేసుల్లో 15 ఏళ్లుగా ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్‌పై విచారణ వేగవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రస్తుతం వైసీపీ చేపట్టిన నిరసనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ‘ధరలు పెంచింది మనమే కదా, ఇప్పుడీ ధర్నాలేంటి?’ అని వారి పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.









