జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం..

నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో మరో కీలక మైలురాయి నమోదైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే సిద్ధమైన సుఖ్‌బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) సోలార్ ప్రాజెక్టును రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ. 3,000 కోట్ల భారీ పెట్టుబడితో, 2,400 ఎకరాల్లో విస్తరించిన ఈ 600 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం, రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘బ్రాండ్ సీబీఎన్’ పట్ల ఉన్న నమ్మకం వల్లే పంజాబ్‌కు చెందిన ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సంస్థ ఏపీకి వచ్చి ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిందని కొనియాడారు.

ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక రైతులకు, యువతకు భారీగా లబ్ధి చేకూరింది. నిర్మాణ సమయంలోనే సుమారు 1,000 మందికి ఉపాధి లభించగా, అందులో 80 శాతం మంది స్థానికులే కావడం విశేషం. అంతేకాకుండా, దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా 760 మంది రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం సమకూరింది. భవిష్యత్తులో వ్యవసాయ వ్యర్థాల నుండి మరో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా SAEL సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం దక్కుతుందని లోకేష్ వివరించారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ గా మార్చడమే లక్ష్యంగా 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే జమ్మలమడుగులో అదానీ, జెన్‌కో వంటి సంస్థల ప్రాజెక్టులు కూడా త్వరలో పట్టాలెక్కబోతున్నాయని మంత్రి వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణలోనూ ఈ సోలార్ పార్క్ కీలక పాత్ర పోషించనుంది. ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా నివారించవచ్చని అంచనా. ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్, జాతీయ గ్రిడ్‌లోకి సరఫరా అయి గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల అవసరాలను కూడా తీర్చనుంది. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన లోకేష్, SAEL వంటి సంస్థలకు ఏ సహాయం కావాలన్నా తాను “ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే” ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో జమ్మలమడుగు ప్రాంతం పారిశ్రామికంగా కొత్త వెలుగులు సంతరించుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు