కాలుష్యరహిత గోదావరిగా పుష్కరాలు: రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బోట్ ఆడిట్!

గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ నిఘా:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఉదయం 6 గంటలకే పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు స్వయంగా పడవలో (బోటులో) ప్రయాణించి, గోదావరి నది కాలుష్యకారక ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలు మరియు వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి తక్షణమే నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులను, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దని, వచ్చే 6 నెలల్లో నదుల కాలుష్య నిర్వహణలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్‌తో పుష్కరాలు:

వచ్చే ఏడాది (జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. పుష్కరాల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా కాగితాల లెక్కలకే పరిమితం కాకుండా, నదీ తీరాన్ని కాపాడేలా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్.సి.పి. (NRCP) కింద కేటాయించిన రూ. 416 కోట్ల నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాలని, పూర్తిగా మురుగు లేకుండా జలాలను శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి విడిచిపెట్టాలని ఆదేశించారు.

పేపర్ మిల్లు వ్యర్థాలపై ఆరా:

నగర మురుగునీరు గోదావరిలోకి కలిసే చింతలమ్మ ఘాట్, నల్లా ఛానల్ ప్రాంతాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్.. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు నదిలోకి విడుదల కావడంపై అధికారులను తీవ్రంగా ఆరా తీశారు. పేపర్ మిల్లు ద్వారా వచ్చే వ్యర్థాలను లంక గ్రామాల్లో విడిచిపెడుతున్నారని, ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు కంపెనీ యోచిస్తోందని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య వివరించారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. సదరు కంపెనీ సొంతంగా సరికొత్త అంతర్జాతీయ విధానాలతో శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి కఠిన ఆదేశాలు ఇవ్వాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో పవన్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మరియు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు