వైఎస్, రాజారెడ్డి మహానుభావులు – చనిపోయిన వారిపై నిందలేస్తారా?: టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డిలపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఫ్యాక్షన్ విమర్శలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ లోకంలో లేని, తమపై వస్తున్న విమర్శలకు సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తులపై టీడీపీ దుష్ప్రచారం చేయడం వారి రాజకీయ అక్కసును బయటపెడుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, చెప్పుకోదగ్గ విజయాలు లేకనే తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ నీచ రాజకీయాలకు తెరలేపారని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజంగా వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ అంత దుర్మార్గులే అయితే.. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదని, ఎందుకు శిక్షించలేకపోయారని షర్మిల నేరుగా ప్రశ్నించారు. వైఎస్ రాజారెడ్డి రాయలసీమలో అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి అని కొనియాడారు. 1973లోనే కడప ప్రజల కోసం 70 పడకల ఉచిత ఆసుపత్రి కట్టించడమే కాకుండా, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు విద్యను అందించిన అటువంటి మహానుభావుడి చరిత్రను వక్రీకరిస్తే సీమ ప్రజలు సహించరని ఆమె హెచ్చరించారు.

సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనమని.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి చారిత్రాత్మక పథకాలు ఆయనకే సాధ్యమయ్యాయని షర్మిల గుర్తు చేశారు. పోలవరం పనులను 33 శాతం పూర్తి చేసిన అపర భగీరథుడైన వైఎస్సార్‌పై బురద జల్లాలని చూసినంత మాత్రాన ఆయన కీర్తి తగ్గదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం శాశ్వతమని పేర్కొంటూ.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, ఓట్లేసిన ప్రజలకు మేలు చేయాలని చంద్రబాబుకు ఆమె హితవు పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు