మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళా సాధికారతపై కీలక ప్రతిపాదన చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో సంబంధం లేకుండా, రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి కేంద్రీయ కార్యాలయం నుండి సరికొత్త సాంకేతికతతో నిర్వహిస్తున్న ఈ హైబ్రిడ్ మహానాడు సదస్సులో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ రాజకీయ శకం మహిళా నాయకత్వానిదేనని తాను బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో మాత్రమే మహిళల గురించి మాట్లాడి, ఆ తర్వాత విస్మరించే ఇతర పార్టీల్లా కాకుండా, టీడీపీ ఎల్లప్పుడూ ఆచరణాత్మక సాధికారతను నమ్ముతుందని ఈ సందర్భంగా లోకేష్ గుర్తుచేశారు.
దేశ ప్రయోజనాలే పరమావధిగా ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ముఖ్యం) అనే నినాదంతో ఈసారి మహానాడును నిర్వహిస్తున్నట్లు నారా లోకేష్ వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో, ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు మద్దతుగా ఈ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. భౌతికంగా మరియు వర్చువల్‌గా అనుసంధానమయ్యేలా రూపొందించిన ఈ సరికొత్త హైబ్రిడ్ మోడల్, రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసిస్తూ, ఈ వయసులోనూ ఆయన రాకెట్ వేగంతో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో వైసిపి ప్రభుత్వ అరాచకాలపై ఎదురొడ్డి పోరాడిన పసుపు సైన్యం త్యాగాలను లోకేష్ ఈ వేదికపై ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ప్రాణాలు పోయినా జెండా దించని కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలని, వారి పోరాట స్ఫూర్తి వల్లే 2024 ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి రికార్డు విజయం సాధించిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. రూ.4 వేల పెన్షన్, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి ఎన్నో సంక్షేమ పథకాలను జెట్ స్పీడ్‌తో అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.









