ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే పరమావధిగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఆరు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం రష్యా రాజధాని మాస్కో చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేష్‌కు భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేశ్ గిరితో పాటు స్థానిక ఆంధ్ర ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఘనస్వాగతం పలికారు.
జూన్ 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ రష్యాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు’ (SPIEF 2026) లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధికి వేదికగా నిలిచే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. ముఖ్యంగా ఐటీ, మౌలిక సదుపాయాలు మరియు వివిధ పారిశ్రామిక రంగాలలో ఏపీని ఒక గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు.
ఈ ఆరు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలువురు అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో వరుసగా ద్వైపాక్షిక భేటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి పెద్ద ఎత్తున రప్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యల్లో ఈ రష్యా పర్యటన అత్యంత కీలకమైన భాగమని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.









