‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం: రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!

ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన టీమ్‌తో కలిసి తగరపువలసలో జరిగిన ఒక అమ్మవారి ఉత్సవాల డ్యాన్స్ ఈవెంట్‌లో పాల్గొని, కారులో తిరిగి వస్తుండగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది.

ప్రయాణంలో పండు మాస్టర్ టీమ్‌లోని ఒక డ్యాన్సర్ అస్వస్థతకు గురికావడంతో అతని కోసం కారును రోడ్డు పక్కన ఆపారు. కారులో నుంచి కిందకు దిగిన పండు మాస్టర్, వాహనం వెనుక భాగంలో నిలబడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోళ్ల వ్యాన్‌కు, కారుకు మధ్యలో పండు మాస్టర్ చిక్కుకుపోవడంతో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే నైట్ బీట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికులు మరియు పండు టీమ్ సభ్యుల సహాయంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు పండు మాస్టర్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీవీ, సినీ రంగాల ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు