ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, మిథనాల్ కెమికల్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘రస్ కెమ్ గ్రూప్’ (Ruschem Group) డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి దర్యా అషానియాలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ పలు ప్రతిపాదనలను వారి ముందుంచారు.
భారతదేశం దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్‌ను ఇక్కడే ప్రాసెస్ చేసేలా, ఏపీ తూర్పు తీరంలోని విశాఖ-కాకినాడ పీసీపీఐఆర్ (PCPIR) పరిధిలో ఒక అత్యాధునిక కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ రస్ కెమ్ ప్రతినిధులను ఆహ్వానించారు. దీనితో పాటు పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ హబ్‌ల నిర్మాణం, బల్క్ కెమికల్ స్టోరేజీ వసతులు, ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్త్‌ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుని ఒక సరికొత్త ‘పాలిమర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ పరిశోధన కేంద్రాన్ని’ (R&D Center) కూడా స్థాపించాలని ఆయన సూచించారు.
మంత్రి లోకేష్ చేసిన ఈ ప్రతిపాదనలపై రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే భారత్‌లో ప్రత్యేక ఎస్పీవీల (SPV) ద్వారా హోల్‌సేల్ కెమికల్ పంపిణీ మార్కెట్లోకి ప్రవేశించామని, స్థానిక సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ సరఫరా కేంద్రం ద్వారా విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా, ఇతర తయారీ పరిశ్రమలకు అవసరమైన కీలక రసాయనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ అందించిన ప్రతిపాదనలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని, వీటిపై తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇల్యా కోసిహ్ స్పష్టం చేశారు.









