హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఒక తెలంగాణ ఆడబిడ్డగా తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తారని.. కానీ, తెలంగాణ రావడం వెనుక ఉన్న పోరాటాల చరిత్రను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆమె హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రం ఏదో సినిమాలో నటిస్తేనో, రాజకీయ పొత్తులు పెట్టుకుంటేనో, డబ్బులు పంచితేనో లేదా లాబీయింగ్ చేస్తేనో రాలేదని వెన్నెల స్పష్టం చేశారు. ఎవ్వరినీ బాధపెట్టకుండా, హింసించకుండా తమను తాము స్వచ్ఛందంగా ఆహుతి చేసుకున్న శ్రీకాంతాచారి లాంటి ఎందరో అమరుల రక్తం, త్యాగాల ఫలితమే ఈనాటి తెలంగాణ అని గుర్తుచేశారు. ఇది మా భూములు, మా నీళ్లు, మా పాలన కోసం సాగిన ఆత్మగౌరవ పోరాటమని.. పాటలు, మాటలతో గడప గడపనూ చైతన్యం చేసిన గొప్ప సాంస్కృతిక యుద్ధమని ఆమె కొనియాడారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అనే మాటపై వెన్నెల ఘాటుగా స్పందిస్తూ.. “అవును అన్నా, మీరు అన్నట్లుగానే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు. నిన్న మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు” అని నినదించారు. కాగా, అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గద్దర్ బతికున్నప్పుడు ఆయనకు కారు కొనిచ్చి సాయం చేశానని, ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారు అప్పుడు ఏం చేశారని ప్రశ్నించడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.









