భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారతదేశ బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ఆంధ్రా ష్రింప్.. ఇండియా సీ-ఫుడ్’ అనే బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన సీఎం, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో ఆక్వా రంగం సమగ్రాభివృద్ధికి అమరావతి నుంచి నెల్లూరు వరకు (అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు) ఒక ‘ఆక్వా కారిడార్’ను అభివృద్ధి చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కారిడార్‌లో ఆధునిక టెక్నాలజీ, పరిశోధనలు, స్టార్టప్‌లతో కూడిన సమగ్ర ఎకో సిస్టం ఏర్పాటు చేస్తామని, ‘పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్’ విధానంతో ముందుకు సాగుతామని వివరించారు. అలాగే కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు 15 రోజుల్లోగా స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇస్తూ, కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్రం ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
దేశ సముద్ర ఆహార ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని సీఎం గణాంకాలతో సహా వివరించారు. దేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతంగా ఉందన్నారు. భారతదేశ సీ-ఫుడ్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 38 శాతం (సుమారు రూ. 28,000 కోట్లకు పైగా) ఏపీ నుంచే సమకూరుతోందని గుర్తుచేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు.. ప్రజలందరూ ఆక్వా ఉత్పత్తుల ద్వారా లభించే ప్రొటీన్లను తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.









