శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సిగ్నల్ ఫ్రీ జర్నీ: హైదరాబాద్‌లో రూ. 189.68 కోట్లతో ఆరు లైన్ల భారీ ఫ్లై ఓవర్!

హైదరాబాద్ నగరంలో శరవేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కాటేదాన్ టు శంషాబాద్ రోడ్‌ వయా మైలార్‌దేవ్‌పల్లి మీదుగా కొత్తగా ఆరు లేన్ల భారీ ఫ్లైఓవర్ (బై డైరెక్షనల్‌ గ్రేడ్‌ సెపరేటర్‌) నిర్మాణానికి మున్సిపల్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ. 189.68 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ఫ్లైఓవర్ పనులకు సంబంధించి ఏజెన్సీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్‌-సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటీవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త వంతెనను ప్లాన్ చేశారు. కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో స్థానిక ట్రాఫిక్‌తో పాటు పరిశ్రమలు, వ్యాపార సంస్థల వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్లే వాహనాల కారణంగా ఇక్కడ తరచూ ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గానూ, ఈ రూట్‌లోని మూడు ప్రధాన జంక్షన్ల దగ్గర సిగ్నల్ ఫ్రీ జర్నీ సాగేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణ టెండర్లలో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ను ఎల్‌-1 బిడ్డర్‌గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే కేవలం ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకే కాకుండా.. ఫలక్‌నుమా, బహదూర్‌పురా, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట వంటి పాతబస్తీ పరిసర ప్రాంతాల వారికి కూడా విమానాశ్రయ రాకపోకలు మరింత సులువు కానున్నాయి. నగరంలో ఇప్పటికే కేబీఆర్‌ పార్కు జంక్షన్‌, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్లలో బ్రిడ్జిల పనులు ప్రారంభం కాగా, పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్‌, రసూల్‌పుర జంక్షన్ల వద్ద కూడా ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు