విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో సరికొత్త రికార్డు సృష్టించింది. పోర్టు పరిధిలో చేపట్టిన పర్యావరణ అనుకూల చర్యలకు గుర్తింపుగా ప్రఖ్యాత ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈఎస్జీ అండ్ సర్క్యులారిటీ’ సంస్థ నుంచి ఈ అరుదైన ‘ఎల్-2 గ్రీన్ పోర్టు’ సర్టిఫికేషన్ లభించింది. వ్యర్థాల సమర్థ నిర్వహణ, కాలుష్య నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ వినియోగం వంటి పలు కీలక అంశాలలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గానూ విశాఖ పోర్టుకు ఈ గౌరవం దక్కింది.
దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలలో వంద శాతం సౌరశక్తి (గ్రీన్ పవర్)తో నడుస్తున్న పోర్టుల జాబితాలో విశాఖపట్నం పోర్టు ముందంజలో ఉంది. పర్యావరణ సమతుల్యత కోసం 2024 నుంచి 2027 మధ్య ఏకంగా ఒక మిలియన్ (10 లక్షలు) మొక్కలు నాటడమే లక్ష్యంగా ఇక్కడ పనులు సాగుతున్నాయి. అంతేకాకుండా, పోర్టు పరిధిలోని అత్యాధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP, ETP) ద్వారా ఫిల్టర్ చేసిన నీటిని యార్డులలో, రోడ్లపై దుమ్ము లేవకుండా చల్లుతూ కాలుష్యాన్ని అదుపు చేస్తున్నారు. సముద్ర తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు ప్రతి ఏటా రూ. 20 కోట్లు కేటాయించడం విశేషం.
తీర ప్రాంత రక్షణతో పాటు సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల్లోనూ విశాఖ పోర్టు ముందంజలో నిలిచింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య రంగాల కోసం రూ. 4.31 కోట్ల సీఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేయడమే కాకుండా.. గతంలో విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించి తన ఉదారతను చాటుకుంది. పోర్టులో కార్గో నిల్వల కోసం కవర్డ్ స్టోరేజీ షెడ్ల నిర్మాణం చేపట్టి ఉద్గారాలను తగ్గించడంలో సఫలీకృతమైనందుకు గానూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో పోర్టు అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









