ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. కర్ణాటక నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేసింది.
హైకమాండ్ ప్రకటించిన వివరాల ప్రకారం కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, మరియు కేంద్ర మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ ఆలీ ఖాన్‌లకు అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో మల్లికార్జున్ ఖర్గే ఈరోజు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.
మరోవైపు, రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని భావించిన వైఎస్ షర్మిలకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. పొరుగు రాష్ట్రం కర్ణాటక కోటా నుండి ఆమెను పెద్దల సభకు పంపుతారని అనుచరులు భావించినప్పటికీ, అధిష్ఠానం సమీకరణాలు మారడంతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో షర్మిల అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.









