గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చెందిన నిధులను తీవ్రంగా దుర్వినియోగం చేసిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఘాటు విమర్శలు చేశారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (UCF) వినియోగం, అలాగే లోన్ల సమీకరణపై APUFIDC ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక ప్రత్యేక వర్క్ షాప్‌నకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అదంతా పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ప్రాజెక్టులను చేపట్టాలని అధికారులకు సూచించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పీపీపీ పద్ధతిలోనే అభివృద్ధి పనులు చేపడుతున్నాయని, తాము కూడా పూర్తి పారదర్శకంగా టెండర్ విధానం ద్వారానే ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యూసీఎఫ్ పథకం ద్వారా రాష్ట్రానికి రూ. 3,600 కోట్ల గ్రాంట్ (25 శాతం) కేటాయించిందని, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 75 శాతం చొప్పున రూ. 10,800 కోట్లను సమీకరించాల్సి ఉందని మంత్రి వివరించారు. ఈ నిధుల సమీకరణ కోసం హడ్కో (HUDCO) సహకారం అందిస్తోందని చెప్పారు. మొత్తంగా మున్సిపాలిటీల్లో రూ. 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను చేపట్టబోతున్నామని, ప్రజలకు రక్షిత మంచినీరు, మెరుగైన రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.









