ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో, అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రూ.1,234.91 కోట్లను కేటాయించారు. ఈ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెటరీ మద్దతు ద్వారా భరించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం చేపడుతున్న మొట్టమొదటి జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (GPRA) ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
ఈ ప్రాజెక్టును కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) నిర్మించనుంది. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో, 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 11 నివాస టవర్లను నిర్మించి, టైప్-II నుండి టైప్-VI వరకు వివిధ కేటగిరీలలో మొత్తం 1,504 ఫ్లాట్లను అందుబాటులోకి తెస్తారు. అంతేకాకుండా, 1,972 కార్ల పార్కింగ్ సదుపాయంతో పాటు బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీసు, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి అన్ని రకాల పౌర వసతులను ఇక్కడ కల్పించనున్నారు.
ఈ ప్రాజెక్టును పూర్తిగా పర్యావరణ హితంగా, కనీసం 4-స్టార్ ‘గ్రీహా’ (GRIHA) రేటింగ్ సాధించేలా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మిస్తారు. అమరావతిలో పనిచేసే కేంద్ర ఉద్యోగులకు కార్యాలయాలకు సమీపంలోనే వసతి కల్పించడం ద్వారా వారి పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ నిర్మాణం వల్ల స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిర్మాణ దశలో ఏటా సుమారు 7 లక్షల పనిదినాలు, ప్రాజెక్టు పూర్తయ్యాక నిర్వహణ దశలో ఏటా 50,000 పనిదినాల ఉపాధి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.









